బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే
అమరావతి : బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనేనని నొక్కి చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుని, ఆ దిశగా చర్యలు చేపట్టిన సమయంలో మళ్లీ న్యాయస్థానాల్లో జగన్ రెడ్డి కేసులు వేయించి అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేసినప్పటికీ, రిజర్వేషన్ల అమలులో ఎదురైన పరిస్థితులను పరిశీలించి, సాధ్యమైన మార్గాల ద్వారా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే నిర్ణయం తీసుకుందని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు లభించిన రిజర్వేషన్ల వివరాలను మంత్రి వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్ పదవుల్లో 27.95 శాతం, ఎంపీటీసీల్లో 25.55 శాతం, ఎంపీపీలు, జెడ్పీటీసీల్లో 24.60 శాతం, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 23 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు 33.02 శాతం, మేయర్ పదవులకు 35.2 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు.
ఈ పరిమితులకు అదనంగా పార్టీ పరంగా బీసీలకు టికెట్లు, పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కల్పించి, 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం లభించేలా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. బీసీలకు ఇంతటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కొల్లు రవీంద్ర. 24 శాతం నుంచి 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవడం బీసీల రాజకీయ సాధికారతకు దోహద పడుతుందని అన్నారు. బీసీ సామాజిక వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బీసీ కార్పొరేషన్లను గాడిలో పెట్టి, వాటి ద్వారా ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. వడ్డెరలకు నిర్మాణ రంగం, భవన నిర్మాణం, రోడ్లకు అవసరమైన కంకర సరఫరా వంటి పనుల్లో 32 శాతం కేటాయింపులు కల్పిస్తున్నామని చెప్పారు.
కల్లుగీత కార్మికులకు రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో 10 శాతం కేటాయింపులు చేశామన్నారు. చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.25 వేల చొప్పున అందించడంతో పాటు, మగ్గాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, అలానే వారికి కనీస వేతనం రూ.25 వేలుకు పెంచాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు గతంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 217ను రద్దు చేశామని చెప్పారు. మత్స్యకార సేవ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.20 వేల చొప్పున సాయం అందించడంతో పాటు, సుమారు రూ.400 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. వలలు, పడవలు అందించడం వంటి చర్యలతో మత్స్యకారులను ఆదుకుంటున్నామని తెలిపారు.
విద్యారంగంలోనూ బీసీ పిల్లలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని కొల్లు రవీంద్ర అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ప్రత్యేక విద్యా కార్యక్రమాలతో పాటు, తల్లికి వందనం పథకం ద్వారా పిల్లల చదువుకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని చెప్పారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనం అందించడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం లభిస్తోందన్నారు. కులవృత్తులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాల్లోనూ బీసీలకు అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బీసీ నాయకత్వాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర బీద రవిచంద్ర, పల్లా శ్రీనివాస్ వంటి బీసీ నాయకులపై కేసులు పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం వంటి ఘటనలను గుర్తు చేశారు. పల్లా శ్రీనివాస్ ఇంటిపై దాడి చేయడం, బీసీ నాయకులను జైళ్లకు పంపించడం వంటి చర్యలు బలహీన వర్గాలను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగమని విమర్శించారు.
తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, బీసీలపై జరిగిన దాడులు, హత్యలు, వాటికి సంబంధించిన కేసుల విషయంలో గత ప్రభుత్వ వైఖరిని ప్రజలు మర్చిపోలేరన్నారు. బీసీలకు రాజకీయంగా రావాల్సిన పదవులను దూరం చేసిన వైసీపీని ఆ వర్గాలు ఎప్పటికీ క్షమించవని వ్యాఖ్యానించారు. బీసీ నాయకత్వానికి రక్షణ కల్పించేందుకు యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే చట్టాన్ని తీసుకు రానున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. గుడ్డ కాల్చి ముఖంపై వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడటం, వయసు, వ్యక్తుల పట్ల గౌరవం లేకుండా వ్యవహరించడం తగదన్నారు. బెదిరింపుల రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని, దర్యాప్తు సంస్థల విచారణ నుంచి ఎవరూ ఎక్కువ కాలం తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయని చూపించి ప్రజలను భయపెట్టేందుకు, పెట్టుబడులు రాకుండా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు పారదర్శకంగా జరిగినప్పటికీ, అభ్యర్థులు శాంతియుతంగా తమ సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన సమయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షం అనవసరంగా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ నేరాలు జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతోనే పెట్టుబడులు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్కు రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందకూడదని, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదని వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.