newsseals.com

ఋతుక్రమ పరిశుభ్రతపై స్పందించ‌క పోతే చర్య‌లు

October 18, 2026 · VijayaBhaskar

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు, బాలిక‌ల‌కు సంబంధించి నెల నెలా వ‌చ్చే రుతుక్ర‌మ ప‌రిశుభ్ర‌త‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రుతుక్ర‌మం విషయంలో రాష్ట్రాలు స్పందించక పోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లభించే ప్రాథమిక హక్కులలో భాగంగా, ఋతుక్రమ ఆరోగ్యాన్ని అమలు చేయడానికి తీసుకున్న చర్యల గురించి నివేదించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశాన్ని కల్పించింది. ఋతుక్రమ పరిశుభ్రతపై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో కేంద్రం అడిగిన ప్రశ్నలకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించక పోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఒకవేళ వారు ఆదేశాలను పాటించకపోతే, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, జీవించే హక్కు , వ్యక్తిగత స్వేచ్ఛలో భాగంగా ‘ఋతుక్రమ పరిశుభ్రత/ఆరోగ్యం’ కూడా ఒక అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మేము తీర్పులో పేర్కొన్న అంశాలు కేవలం కాగితాలకే పరిమితమైతే ఇక ఈ ప్రాథమిక హక్కును కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా అమలు చేస్తాయి? అని జస్టిస్ జె.బి. పార్దివాలా , జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. సెప్టెంబర్ 1న, కోర్టు గుర్తించిన లోపాలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ధర్మాసనం ఆదేశించింది. జనవరి 30న ఇచ్చిన ఒక కీలక తీర్పులో, ఆర్టికల్ 21 కింద లభించే జీవించే హక్కులో ‘ఋతుక్రమ ఆరోగ్యం’ కూడా అంతర్భాగమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజాగా విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, తీర్పును ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలియ జేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరినట్లు ధర్మాసనానికి వివరించారు.

Related News