తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సూర్యప్రభ వాహనసేవలో జాతీయ, అంతర్జాతీయ కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి విచ్చేసిన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలను ప్రదర్శించడంతో తిరుమాడ వీధులు భక్తిరసంతో, సాంస్కృతిక వైభవంతో శోభిల్లాయి. పుదుచ్చేరి కళాకారుల కరగట్టం, పంజాబ్ కళాకారుల భాంగ్రా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు భరత నాట్యంతో అలరించారు. ఖతర్కు చెందిన శ్రీమతి సుచిత్ర పూవంచలిల్ బృందం భరత నాట్యం, దుబాయ్కు చెందిన శ్రీమతి ప్రీతి బృందం కూచిపూడి నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ లంబాడీ నృత్యం, కర్ణాటక గజేంద్రమోక్షం నృత్యరూపకం, సిక్కిం మరుణి నృత్యం, మధ్యప్రదేశ్ కథక్, పంజాబ్ భాంగ్రా ప్రదర్శనలు భారతీయ కళా సంప్రదాయాల వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. సూర్యప్రభ వాహనసేవలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన ఐదు కళాబృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అభినందించి సత్కరించారు. పుదుచ్చేరికి చెందిన సంగీత బృందం, పంజాబ్ కు చెందిన హర్దీప్ సిగ్ ఔజ్లా బృందం, తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందం , ఖతర్ కు చెందిన సుచిత్ర పూవంచలిల్ బృందం , దుబాయ్ కి చెందిన ప్రీతి బృందాలను సత్కరించారు. ఈ వాహనసేవలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టులకు చెందిన మొత్తం 14 కళాబృందాల్లోని 411 మంది కళాకారులు పాల్గొన్నారు.




