జగన్ రెడ్డిని జనం నమ్మరు : అచ్చెన్న
అమరావతి : ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగబద్ధ పాలన సాగుతోందా? రాష్ట్రంలో చట్టం, న్యాయం పనిచేస్తున్నాయా? అంటూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాజా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, నేడు మరో విధంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం తగదని పేర్కొన్నారు. నేడు ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, నామినేషన్ల ప్రక్రియపై జగన్ సంధిస్తున్న ప్రశ్నలనే 2020 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అడిగారని గుర్తు చేశారు. ఆనాడు ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం, బలవంతపు ఉపసంహరణలపై వచ్చిన ఫిర్యాదులకు నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానమేమిటని నిలదీశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణపై ఉపన్యాసాలు ఇచ్చే ముందు గత ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న వివాదాలపై జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు . వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కార్యకర్తల ప్రాణాలను కాపాడు కోవడమే ప్రధాన సమస్యగా మారిందని నాటి పరిస్థితులను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు ప్రతిపక్ష అభ్యర్థులు ఎదుర్కొన్న బెదిరింపులు, భౌతిక దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై ఎన్నో ఫిర్యాదులు చేసినా స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొంటుందనే విశ్వాసం కలగలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై అపనమ్మకం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించిందని తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవాలని అన్నారు.