newsseals.com

బిగ్ బాస్ షోలో కొంద‌రికే ప్ర‌యారిటీ..?

October 19, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న జ‌నాద‌ర‌ణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్ 10 పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా. బిగ్ బాస్ తెలుగు 10లో ‘పక్షపాతం’పై నెటిజన్లు మండిప‌డుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కొంద‌రికే ప్ర‌యారిటీ ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు వీరు వేసిన‌ ప్రశ్నలు సంచ‌ల‌నంగా మారాయి. ఇదిలా ఉండ‌గా 10వ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లభించడం లేదు. ఇప్పటి వరకు ఈ షో ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో విఫలమైంది. ప్రస్తుత సీజన్‌లో షాలిని-రోహిత్, ముఖేష్-వర్షిణి వంటి వారి వ్యక్తిగత సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు కంటెస్టెంట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాతం చూపుతున్నారని నెటిజన్లు నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యమైన కంటెంట్ లేక పోవడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ షోకు దూరమవుతున్నారు.

మరోవైపు, నిర్వాహకులు రోహిత్‌కు పరోక్షంగా సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన నీతూ నటరాజ్, రోహిత్‌తో మాట్లాడుతూ ఆటపై దృష్టి పెట్టాలని చెప్పడం గమనార్హం. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షాలిని ఎలిమినేట్ అయినట్లు చూపించినప్పటికీ, ఆమెను రహస్య గదికి (సీక్రెట్ రూమ్) పంపారు. షాలిని ఎలిమినేషన్ కేవలం ఒక నాటకమని, ఇది రోహిత్ గెలవడానికి సహాయ పడుతుందని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. షాలిని తిరిగి హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు, ఇతర కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను రోహిత్‌తో పంచుకునే అవకాశం ఉంది. రోహిత్‌ను విజేతగా నిలపడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారా లేదా అనేది వేచి చూడాలి. ‘బిగ్ బాస్ తెలుగు 10’ విజేత ఎవరనేది ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా నిర్ణయించ బడుతుంది. మరి రోహిత్ ఈ షో ట్రోఫీని గెలుచుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Related News