newsseals.com

ఏపీలో విద్యుత్ ప్ర‌సార నెట్ వ‌ర్క్ కు రూ. 21,838 కోట్లు

October 19, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : కేంద్రం ఏపీకి ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. గ్రీన్ ఎనర్జీ గ్రిడ్ విద్యుత్ నెట్‌వర్క్ విస్తరణ కోసం కేంద్రం రూ. 21,838 కోట్లు మంజూరు చేసింది. ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III’ పథకం కింద, హరిత ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు, అధిక సామర్థ్యం గల ప్రసార లైన్లు , కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా గ్రిడ్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యుత్ ప్రసార సంస్థ (ట్రాన్స్‌కో) ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో 135 గిగావాట్ల (GW) పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌లోకి చేర్చేందుకు వీలుగా, అంతర్-రాష్ట్ర ప్రసార వ్యవస్థను (InSTS) బలోపేతం చేసేందుకు కేంద్రం ఈ ‘GEC-III’ పథకానికి ఆమోదం తెలిపింది.

అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాల వద్ద లేదా గ్రిడ్ సౌలభ్యం కోసం అవసరమైన ఇతర ప్రాంతాల్లో 50 గిగావాట్-అవర్ల (GWh) సామర్థ్యం గల ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్’ (BESS) ఏర్పాటుకు కూడా ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఇది విద్యుత్ సరఫరాలో అస్థిరతలను అధిగమించడానికి, గ్రిడ్ రద్దీని తగ్గించడానికి, పీక్ అవర్స్‌లో విద్యుత్ కొరతను నివారించడానికి, సౌరశక్తి లభించని సమయాల్లో విద్యుత్ డిమాండ్‌ను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ పథకం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రిడ్ అనుసంధానాన్ని, విద్యుత్ తరలింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ పథకాన్ని 2032-33 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 1,86,405 కోట్లు. ఇందులో GEC-III కింద రాష్ట్ర అంతర్గత ప్రసార వ్యవస్థల (Intra-State Transmission Systems – InSTS) అభివృద్ధికి రూ. 1,36,378 కోట్లు, 50 GWh సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) కోసం రూ. 50,000 కోట్లు కేటాయించారు.

Related News