సొంత జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఆయా సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకు రావడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. ఈ లక్ష్య సాధనలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అందుకే సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం అన్నారు. ఇటీవల డీఎస్‌హెచ్ పరిధిలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించడంతో పాటు అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టాం అన్నారు. ఈ నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బందిని, వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించు కోవాలని సూచించారు.
స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, సిబ్బంది లేక వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలపై సమగ్ర సమీక్ష చేపట్టాలని అధికారులను ఆదేశించారు దామోదర . 30, 50, 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు వాటి స్థాయికి అనుగుణంగా వైద్య సేవల పరిధిని నిర్ణయించాలని అన్నారు. సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, పడకలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ కేర్ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూసి, లోటుపాట్లను గుర్తించి, అవసరమైన అదనపు పోస్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తున్నాం అన్నారు.