బాలయ్య ఆశీస్సులు తీసుకున్న పరిటాల శ్రీరామ్
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : రాయలసీమలో సంచలనంగా మారాడు యువ రాజకీయ నాయకుడు, దివంగత నేత పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్. తాజాగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆయన జెడ్పీటీసీగా గెలుపొందారు. ఊహించని రీతిలో శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు తొలి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రజల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. పార్టీ చీఫ్, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ మద్దతుతో పరిటాల శ్రీరామ్ కు కీలకమైన జెడ్పీ చైర్మన్ పదవి దక్కింది. ఇదిలా ఉండగా తమ పార్టీకి చెందిన పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం శాసన సభ నియోకజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తన్న, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను తన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు పరిటాల శ్రీరామ్. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. భవిష్యత్తులో మరింతగా ఎదగాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ సందర్బంగా నందమూరి బాలయ్య.
పరిటాల కుటుంబంతో నందమూరి కుటుంబానికి దగ్గరి అనుబంధం ఉంది. ఇక పరిటాల శ్రీరామ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆయన తెలుగుదేశం పార్టీ లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తల్లి పరిటాల సునీత. ఆమె ప్రస్తుతం రాప్తాడు శాసన సభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణ లోనూ బలమైన వర్గం ఉంది పరిటాల కుటుంబానికి. మరో వైపు రాబోయే రోజుల్లో యువ నాయకుడైన నారా లోకేష్ తనకంటూ యువ నాయకులను తయారు చేసుకుంటున్నారు. అందులో భాగంగా తన అనుచరుడిగా ముద్ర పడిన పరిటాల శ్రీరామ్ కు కీలకమైన పదవి ఇప్పటించడంలో కీలక పాత్ర పోషించారు.