హైదరాబాద్ : దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషించిన చిత్రం ఆకాశంలో ఒక తార. రూ. 60 కోట్లతో తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. ఇందులో అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది రుహానీ శర్మ. తనతో పాటు శ్రుతీ హాసన్ , సాత్విక వీరవల్లి కూడా ఇందులో నటించారు..గుండెల్ని మీటేలా చేశారు. ఈ సందర్బంగా రుహానీ శర్మ తన పాత్రకు సంబంధించి ఆసక్తికర అభిప్రాయలు వ్యక్తం చేసింది. తన మాటల్లోనే …కొన్ని పాత్రలు అవి చెప్పే కథల వల్ల ప్రత్యేకంగా నిలుస్తాయి. మరికొన్ని పాత్రలు నిశ్శబ్దంగా మన హృదయాల్లోకి ప్రవేశించి, అక్కడే ఉండి పోతాయి. నా విషయానికి వస్తే బిజ్లీ అటువంటి పాత్రే.
నేను ఇంత వరకు ఏ పాత్రను కూడా ఇంతగా ఆరాధించ లేదేమో అనిపిస్తుంది. ఆ పాత్రను పోషించే ప్రయాణంలో, నేను ఎంతగానో ప్రేమించాను. దయ, స్వచ్ఛత, అమాయకత్వం, దృఢత్వం, ప్రేమించే తీరు. అన్నీ ఎంతో అద్భుతం. కృష్ణుడి జీవిత వాస్తవాలు తెలిసినా, అతను తనను తాను ప్రేమించినంతగా తిరిగి ప్రేమించక పోవచ్చని తెలిసినా, అతడిని తన సర్వస్వంతో ప్రేమించింది. ఎంపిక చేయబడాలని కాదు, అతడిని సొంతం చేసుకోవాలని కాదు, కనీసం ప్రతిఫలంగా ప్రేమను ఆశించలేదు కూడా. తను కేవలం అతడిని ప్రేమించింది అంతే.
ఏమీ ఆశించని ప్రేమలో ఏదో ఒక అరుదైన, అందమైన విషయం ఉంటుంది. అతడిని ఆరాధించిన తీరు, అతను ఎలా ఉన్నాడో అలానే అర్థం చేసుకున్న విధానం, అంతగా ప్రేమించినా కూడా ఎంతో హుందాగా అతడిని వదిలి వెళ్లగలిగిన తీరు… ఇవన్నీ నన్ను ఎంతగా కదిలించాయంటే, మాటల్లో చెప్పలేను.




