విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అవసరం
హైదరాబాద్ : విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పరిశోధనా స్ఫూర్తిని పెంపొందించడానికి విజ్ఞాన ప్రదర్శనలు అద్భుతమైన వేదికలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 54వ హైదరాబాద్ జిల్లా స్థాయి బాలల విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు ప్రయోగాలను వీక్షించారు.
హైదరాబాద్ జిల్లాలో ఐదు వేర్వేరు విభాగాలలో 392 విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించడం ప్రశంసనీయం అని పేర్కొన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ముఖ్యంగా, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర విభాగాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన 167 ప్రదర్శనలు వారి ప్రతిభకు, ఊహాశక్తికి నిదర్శనం అన్నారు
నేటి పిల్లలే రేపటి శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలు. విద్యార్థులు పాఠ్యపుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, కొత్త విషయాలను అన్వేషిస్తూ సమాజ సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభాకర్ . తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు పిల్లలను మొబైల్ ఫోన్లలో ఆటలు ఆడటానికే పరిమితం చేయకుండా, జ్ఞానాన్ని అన్వేషించడానికి , సృజనాత్మకంగా ఉండటానికి ప్రోత్సహించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి , విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు , విద్యాశాఖ అధికారులందరికీ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ జిజ్ఞాసను, పరిశోధనా తృష్ణను పెంపొందించుకుంట, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి గొప్ప కీర్తిని తెస్తారని ఆశిస్తున్నానని అన్నారు.