
ప్రజాస్వామనే దేవాలయానికి గుండె కాయ లాంటిది భారతీయ ఎన్నికల సంఘం (సీఈసీ). అదే గతి తప్పితే ఎలా. ఎంత పారదర్శకతతో ఉంటే అంత దేశానికి మేలు జరుగుతుంది. వ్యవస్థలను నియంత్రించి స్పూర్తి దాయకంగా ఉండాల్సిన ఏకైక కీలకమైన వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘానిది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంది. భారత రాజ్యాంగం అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది. కోట్లాది మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది ఈసీనే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదేమో మార్కెట్ లో దొరికే వస్తువు కాదు. తీసి పారేయడానికో లేదా పక్కన పెట్టేయడానికి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు మాత్రమే అని ఊరుకుంటే ఎలా..?. తనకు అపరిమితమైన బాధ్యతలు ఉన్నాయి. అంతకు మించిన అధికారాలు ఉన్నాయని గుర్తించాలి. మరోసారి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ను గుర్తు తెచ్చు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఎవరో ఆలోచించాలి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ ను కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ మోదీ ప్రభుత్వం ఎందుకని ఆదరా బాదరాగా ఎంపిక చేసింది. దీని వెనుక గల కారణం ఏమిటి..?. ఒకసారి ఆలోచించు కోవాలి. కేంద్ర ఎన్నికల వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండాలి. వీలైతే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత రాష్ట్రపతిని, ఉప రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని కూడా నిలదీయ గలగాలి. అవసరమైతే ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉండాలి. ఆ స్థాయిలో ఎన్నికల కమిషనర్లు ఉండాలి. అయ్యా ఎస్ అనే ఎన్నికల కమిషనర్ల వల్ల దేశం కోరిన పారదర్శకత సిద్దించదు. ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం. ఈ మొత్తం వ్యవహారంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఒక రకంగా అంతా తామేనని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది. ఎప్పుడైతే ఈసీ సక్రమంగా పని చేయడం మానేస్తోందో ఆరోజు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఇక రాచరికం రాజ్యం ఏలుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు స్వతంత్ర సచివాలయం, రూల్ మేకింగ్ అధికారాలు, స్వతంత్ర బడ్జెట్ , అభిశంసన నుండి సమాన రక్షణ కూడా ఉంటుందని గుర్తుంచు కోవాలని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్లను ఏకపక్షంగా నియమించేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ కమిటీ సిఫార్సు చేస్తుంది నియామకానికి సంబంధించి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ జోక్యం నుండి అత్యున్నత ఎన్నికల సంఘాన్ని నిరోధించేందుకు దర్మాసనం చారిత్రిక తీర్పు వెలువరించింది. ఎన్నికలు నిస్సందేహంగా నిష్పక్ష పాతంగా జరగాలి. దాని స్వచ్ఛతను కాపాడు కోవడానికి అని పేర్కొంది ధర్మాసనం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల స్వచ్ఛత తప్పనిసరిగా నిర్వహించ బడాలి. లేకుంటే అది వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించింది.
ప్రజాస్వామ్యం పెళుసుగా ఉందని, చట్ట బద్దమైన పాలనపై పెదవి విప్పితే పతనం అవుతుందని న్యాయమూర్తులు పేర్కొనడం కలకలం రేపింది. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ చట్రం, చట్టానికి లోబడి పనిచేయాలి. అన్యాయంగా వ్యవహరించ కూడదని హెచ్చరించింది. 24 గంటల్లోనే మెరుపు వేగంతో మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ ను ఎన్నికల కమిషనర్ గా ఎలా నియమిస్తారంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను కాపాడేందుకు భాగస్వామ్యులంతా కృషి చేయాలని సూచించింది. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని పొందే మార్గాలు స్వచ్చంగా ఉండాలి. రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఇంత చేసినా కేంద్ర ఎన్నికల సంఘం తన తీరు మార్చు కోవడం లేదు. మరోసారి తన డొల్లతనాన్ని బయట పెట్టుకుంది. దాని నిర్వాకం గురించి యావత్ దేశం సాక్షిగా బయట పెట్టారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీకి మేలు చేకూర్చేలా ఓటర్ల జాబితాను తారు మారు చేయడం, కొత్త ఓటర్లను నమోదు చేయించడం, పాత ఓటర్లను తలగించడం. దీనిని సవాల్ చేసినా నేటి వరకు ఈసీ నోరు మెదప లేదు. పలు అనుమానాలకు తావిచ్చే లా వ్యవహరించడం ప్రశ్నార్థకంగా మారింది.
రాహుల్ అడిగిన వెంటనే ఈసీ తన అధికారిక వెబ్ సైట్ నుంచి ఎందుకు జాబితాను తొలగించాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. వెన్నుముక లేని వ్యవస్థగా కేంద్ర ఎన్నికల సంఘం మారిపోతే ఇక డెమోక్రసీ ఎలా మనగలుగుతుంది..? ఓటు వేసే ప్రతి భారతీయుడు ఆలోచించాలి. తమ ఓట్లు ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయో ఒక్కసారైనా మీలో మీరు పునరాలోచించు కోవాలి. లేకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోతాం. బానిస మనస్తత్వానికి బలై పోతాం. 143 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇది. ఇకనైనా ఓటు వజ్రాయుధమని గుర్తించాలి..ఆనాడే ఈసీలో మార్పు వస్తుంది..లేకపోతే ఉన్న చోటునే ఉండి పోతుంది. తస్మాత్ జాగ్రత్త.