అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన సమీక్ష చేపట్టారు.
ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్‌గా వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య సేవలు అందించడంతో పాటు ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానం మారేలా చూడాలని సూచించారు. హోమియోపతి, ఆయుర్వేద, యోగా, ప్రాణాయామం, ఇంకా అత్యాధునిక వైద్య విజ్ఞానాన్ని వినియోగించు కోవాలని కోరారు సీఎం. ఏఐ డాక్టర్ కూడా విస్తృతంగా వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. డేటాను భద్రపరచడం, గోప్యంగా ఉంచడంతో పాటు… డ్యాష్ బోర్డు సిద్ధం చేయాలన్నారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ సహా వివిధ ఔట్ సోర్సింగ్ సేవల విషయంలో దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సమర్ధవంతంగా వైద్య సేవలు అందించని ఔట్ సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్లను తొలిగించేలా ఒక విధానం తీసుకు రావాలని ఆదేశించారు. విశ్వాసం పెంచేలా వైద్య సేవలు ఉండాలి. ప్రజల మొబైళ్లకు నేరుగా హెల్త్ అప్డేట్స్ పంపించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి అని చెప్పారు.
కుప్పం, చిత్తూరు ప్రాంతాల్లో సంజీవని కార్యక్రమం అమలుతో వచ్చిన ఫలితాలను సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు అమలుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టు అధికారులు వివరించారు. చిత్తూరులో నమోదైన ఫలితాల ప్రకారం హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు తేలిందన్నారు. డయాబెటిస్ కేసుల్లో 16 శాతం కేసుల తీవ్రత తగ్గిందన్నారు. అలాగే, ప్రైమరీ హెల్త్‌కేర్ సేవల వినియోగంలోనూ గణనీయమైన పెరుగుదల నమోదైనట్టు వెల్లడించారు. సంజీవని సేవలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 91 శాతం మంది తమ ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని చెప్పారన్నారు. స్క్రీనింగ్ నుంచి చికిత్స, ఫాలోఅప్ వరకు ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.





