అమరావతి : కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయట పడ్జారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన ఏడుగురిలో అంతా సురక్షితంగా ఉండడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలుసు కునేందుకు నిరంతరం శ్రమించిన గాలింపు బృందాలకు, అధికార యంత్రాంగానికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు సాకేంతిక లోపంతో పనిచేయక, గాలులకు వేరే ప్రాంతానికి కొట్టుకు పోయింది. నిర్ణీత గడువు దాటినా తిరిగి రాలేదనే విషయం తెలిసిన వెంటనే సీఎం దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. స్వయంగా మంత్రులను పంపి గాలింపును పర్యవేక్షించారు.
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని మార్గాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఘటనపై సిఎం మూడు సార్లు సమీక్షించి రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఏ మాత్రం నిరాశ చెందుకుండా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరిపింది. కోనసీమ తీరం నుంచి పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండొచ్చనే అంచనాతో పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్ విభాగాలను, అక్కడ స్థానికంగా ఉన్న శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల సహకారాన్ని కూడా తీసుకున్నారు. అన్ని ప్రయత్నాలు ఫలించి శంకర్‌పూర్ సమీపంలో బోటును, అందులోని ఏడుగురు మత్స్యకారులను రక్షించారు. అలాగే మత్స్యకారుల ఆచూకీ లభ్యమైన వెంటనే ఆ వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు.





