హైదరాబాద్ : ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వస్తున్న ఉత్కంఠకు గురువారం నాటితో తెరదించారు. ఆయన ఢిల్లీ వేదికగా హైకమాండ్ తో చేసిన సంప్రదింపులు, లాబీయింగ్ పని చేసింది. ఇక తనను ఎదిరించేందుకు ప్రయత్నం చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆమె తనంతకు తానుగా పదవి నుంచి తప్పుకోవాలని సూచించింది హైకమాండ్ . అందుకు ససేమిరా అనడంతో గత్యంతరం లేక తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు పంపించినట్లు తెలిపారు. ఇదే క్రమంలో పార్టీ లైన్ తప్పిన, సీనియర్ నాయకుడైన , సుదీర్ఘ కాలం పాటు పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చిన జిల్లెల చిన్నారెడ్డిపై కూడా వేటు వేశారు. ఆయనను తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా , కేబినెట్ హోదా కలిగిన తన నియామకాన్ని కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. చిన్నారెడ్డి స్థానంలో తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా తిరిగి నెరెళ్ల శారద నియామకానికి ఆమోదం తెలిపారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్ పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధారాణి నియమించినట్లు ప్రకటించారు.






