తిరుపతి : తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రాబోయే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, శ్రేయస్సు , అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు, తిరుమల సీవీ, ఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాల మేరకు తిరుమలలో ఫైర్ ఫైటింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్స్ ఆధ్వర్యంలో సంయుక్త అవగాహన కార్యక్రమం నిర్వహించారు.తిరుమల ఆస్థాన మండపంలో తిరుమల డీఎస్పీ విజయ శేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తిరుమల పోలీసు అధికారులు, సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ , సెక్యూరిటీ సిబ్బంది, హెల్త్ డిపార్ట్‌మెంట్, ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ఫైర్ సర్వీసెస్ సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్ అనుమానాస్పద వస్తువులను గుర్తించడం, వాటి విషయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, డిస్పోజల్ పరికరాల వినియోగంపై అవగాహనతో పాటు డెమో నిర్వహించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రానున్న నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్, బీడీ టీమ్స్ , ఇతర విభాగాలు సమన్వయంతో వేగంగా స్పందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని స్పష్టం చేశారు.






