అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రైతుల పంటల సాగుకు సంబంధించి 80 శాతం సబ్సిడీతో 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు సిద్దం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు వ్యవసాయ శాఖపై. అధికారులు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఎల్ నినో అంశంపై గ్రామాల్లో ఎక్కువగా పర్యటించి రైతుల్లో అవగాహన పెంచాలని స్పష్టం చేశారు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాల సాగును ప్రొత్సహించడంతో పాటు… డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటలను సాగు చేసేలా రైతులను చైతన్యం చేయాలన్నారు సీఎం. అంతే కాకుండా వర్షాభావ పంటల సాగు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు.
సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటిని పంపగలుగుతున్నాం అని పేర్కొన్నారు. హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు నీరందించినట్లు చెప్పారు. ఇప్పుడు తాగు నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న చర్యల వల్లే ఎల్ నినో వంటి సమయాల్లో కూడా హంద్రీ-నీవా కాల్వల్లో నీరు వస్తుందన్నారు. రూ.3,500 కోట్ల ఖర్చుతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల్లో నీటిని పారించగలిగామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో ఇరిగేషన్ నిమిత్తం రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 2019-24 మధ్యన నాటి ప్రభుత్వం కేవలం రూ.22 వేల కోట్లే ఖర్చు పెట్టిందని చెప్పారు సీఎం. ప్రాజెక్టులు పూర్తి అయ్యుంటే ఎల్ నినో వంటి విపత్తు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదన్నారు.






