బ్రహ్మోత్సవాల్లో అలరించిన సీతాకల్యాణం నృత్య రూపకం

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఆరవ రోజు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “సీతాకల్యాణం” నృత్యరూపకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకురాలు చిన్నమదేవి బృందం నిర్వహించిన గాత్ర కచేరి హృద్యంగా సాగింది. అన్నమయ్య కీర్తన వాడే వేంకటాద్రితో కచేరిని ప్రారంభించిన చిన్నమదేవి, అనంతరం “శ్రీనివాస తే చరణం”, త్యాగరాజ స్వామివారి “సరస సామ దాన భేద” తదితర కీర్తనలను ఆలపించారు. మృదుమధుర గాత్రంతో ఆమె ఆలపించిన భక్తిగీతాలు శ్రోతలను భక్తిభావంలో ఓలలాడించాయి.

అనంతరం శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల భరతనాట్య అధ్యాపకులు సి. హరనాథ్‌ తన శిష్య బృందంతో ప్రదర్శించిన “సీతాకల్యాణం” నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరాముడు–సీతాదేవి కల్యాణ ఘట్టాలను భరతనాట్య అభినయం, నృత్య విన్యాసాలతో కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. కళాకారుల హావభావాలు, నృత్యాభినయం, చక్కటి సమన్వయంతో మహతి కళాక్షేత్రం ఆధ్యాత్మిక కళావేదికగా మారింది. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన కుమారి శ్రీనిధి బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించి ఆహూతులను అలరించింది. అనంతరం సింగపూర్‌కు చెందిన రత్నకుమార్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకుంది.

శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద తిరుపతికి చెందిన సుగుణమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాదుకు చెందిన గాయత్రి, మయూరి బృందాలు సంకీర్తన ఆలాపనతో భక్తులను అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద సంఖ్యలో తిరుపతి నగర ప్రజలు తిలకించి ఆనందించారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

    తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య…

    బాలాపూర్ గ‌ణేష్ స‌న్నిధిలో విజ‌య్ దేవ‌ర‌కొండ

    హైద‌రాబాద్ : యంగ్ ఎన‌ర్జ‌టిక్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. ఆయ‌న హైద‌రాబాద్ లోని బాలాపూర్ గణేష్ విగ్ర‌హాన్ని సంద‌ర్శించి పూజ‌లు చేశారు. తాజాగా విజయ్ ఆలయ సందర్శన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పండుగ సీజన్‌లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *