Thursday, 5 November 2026

ప్ర‌తిభావంతుల‌కు సీఎం విజ‌య్ స‌త్కారం

newsseals-CMVjay

చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ 10, 12వ తరగతిలో ప్రభుత్వ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఏటా సత్కరిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగ చెన్నైలో టీవీకే ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్. అరియలూర్, కడలూర్, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై , విల్లుపురం జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు. వారికి బహుమతులు అందజేసి సత్కరించారు. తన పార్టీ నిర్వహించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో 10, 12వ తరగతి టాపర్లను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ తాను రాజకీయాల గురించి మాట్లాడటానికి, ఓట్లు అడగడానికో లేదా 2029 ఎన్నికలకు సిద్ధం కావడానికో రాలేదని అన్నారు. యువతరాన్ని వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహించడానికే వచ్చానని చెప్పారు సీఎం.

తాను ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా కాకుండా వారి అన్నగా హాజరయ్యానని పేర్కొన్నారు. ఈ దశలో మీకు పార్టీ రాజకీయాలు అవసరం లేదని నేను భావిస్తున్నాను. బాగా చదవండి, గొప్ప విజయాలు సాధించండి, ఉన్నత శిఖరాలను చేరుకోండి . మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకోండి అని దిశా నిర్దేశం చేశారు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించు కోవాలని కోరారు. గుంపులో ప్రత్యేకంగా నిలిచే వారికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని విజయ్ అన్నారు. ఆయన పరస్పర గౌరవం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు . మాదకద్రవ్యాలు, అవినీతి, ఇతర అవాంఛనీయ పద్ధతులకు బలికావద్దని విద్యార్థులను హెచ్చరించారు. ఆనందం జీవితంలో ఒక భాగమేనని అంగీకరిస్తూనే, వారు ఎన్నడూ తప్పులకు బానిసలు కాకూడదని హిత‌వు ప‌లికారు సీఎం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *