అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నందన్ నిలేకని భేటి అయ్యారు. నందన్ నిలేకనికి స్వాగతం పలికారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. దేశ పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చటంలో భాగంగా నందన్ నిలేకని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ సందర్బంగా ఆయన దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిన్న తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు . సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో సమావేశం అయ్యారు. అనంతరం ఏపీకి విచ్చేశారు. పరీక్షల విధానంలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది టాస్క్‌ఫోర్స్ బృందం. ఆయా రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను అధ్యయనం చేస్తోంది ఉన్నత స్థాయి టీం.
ఏపీలో అనుసరిస్తున్న అకడమిక్, కాంపిటేటివ్ పరీక్షల నిర్వహణ విధానాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు నందన్ నిలేకని. పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట, పరీక్షల నిర్వహణకు టెక్నాలజీ వినియోగం, సైబర్ సెక్యూరిటీని, డిజిటల్ ఫోరెన్సిక్స్ విభాగాలను బలోపేతం చేయడంపై ఈ బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానాన్ని రూపొందించేలా అధ్యయనం చేస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమ న్యాయం జరిగేలా ఒక సమగ్రమైన జాతీయ పరీక్షా విధానాన్ని ఖరారు చేయడం కోసం సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన డీఎస్సీ నిర్వహణలో అనుసరించిన నూతన విధానాలను, టెక్నాలజీ వినియోగాన్ని టాస్క్ ఫోర్స్‌కు వివరించారు మంత్రి లోకేష్. ఇదిలా ఉండగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా మొత్తం విద్యా విధానంలో సంస్కరణలు తేవాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.




