
ఎవరీ ట్రబుల్ షూటర్, ఏమిటా కథ అనుకుంటున్నారా. ఈ దేశ రాజకీయాలలో విలక్షణమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఉప రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వాడైన ముప్పవరపు వెంకయ్య నాయుడు. సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు భాషాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి. కరడు గట్టిన హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో కార్యకర్తగా ప్రారంభమైన ఆయన జీవితం ఎన్నో సవాళ్లను, మరెన్నో ఇబ్బందులను అధిగమించింది. చివరకు భారత దేశంలో అత్యున్నతమైన ఉప రాష్ట్రపతి పదవితో ముగిసింది. వెంకయ్య నాయుడుకు రాజకీయ పరంగా శత్రువులు లేరు. అంతా మిత్రులే. ఆత్మీయ సహచరులే. మాటకు ఉన్న విలువ ఏమిటో , దాని ద్వారా ఎన్ని పనులైనా చేసుకోవచ్చో, ప్రతిపక్షాలను సైతం ఎలా మెస్మరైజ్ చేయొచ్చో తనను చూస్తే తెలుస్తుంది. ఇదే ఆయనకు ఉన్న ప్రత్యేకత. తన ఇన్నేళ్ల ప్రయాణంలో చేపట్టని పదవి అంటూ లేదు. అందుకే బీజేపీలో తనను ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు.
ప్రస్తుతం ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్. వైస్ ప్రెసిడెంట్ పదవి కాలం పూర్తయిన సమయంలో అందరూ అనుకున్నారు తనను రాష్ట్రపతి పదవికి ప్రమోట్ చేస్తారని. కానీ అనూహ్యంగా మోదీ పరివారం తనను పరిమితం చేసింది. దీంతో హస్తిన నుంచి పెట్టేబేడా సర్దుకుని తన స్వంతూరుకు విచ్చేశారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసి , భారతీయ నాగరిక, విలువల గురించి ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఈ మధ్యనే తిరుమల వెళ్లారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వీఐపీల వల్ల సామాన్యుల భక్తులకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనం చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలవరం రేపాయి. ఎవరైనా వయసు పెరిగితే ఇంటికో లేదా ఫామ్ హౌస్ కో పరిమితం అవుతారు. కానీ వెంకయ్య నాయుడు అలా కాదు . ఆయన నిత్య విద్యార్థి. పుస్తక ప్రియుడు. సమస్త ప్రపంచంలో ఏం జరుగుతుందో పరిశీలించడమే కాదు అందరికీ అర్థమయ్యేలా వివరించ గలడు. ఒప్పించగలడు. ఆయనకు ఆ నేర్పు ముందు నుంచే వచ్చింది.
ఈ సమయంలో వెంకయ్య నాయుడు బీజేపీలో హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం ఇప్పుడు ఉప రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఇప్పటి దాకా ఈ పదవిని నిర్వహించిన జగదీప్ ధన్ ఖర్ ఉన్నట్టుండి రాజీనామా చేశాడు. మోదీతో విభేదించడం వల్లనే తను తప్పుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించినా అదేమీ లేదని, తనకు ఆరోగ్యం బాగోలేదంటూ వెళ్లి పోతున్నానని చెప్పాడు. ఇన్నేళ్లుగా సేవలందించినా ఆయనకు వీడ్కోలు కూడా ఏర్పాటు చేయక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. రెండు పదవులు నిర్వహించడం ఇబ్బందిగా మారుతోందని వాపోతున్నారు. దీంతో బీజేపీకి గతంలో అధ్యక్షుడిగా పని చేసిన వెంకయ్యను మరోసారి పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా సరే అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వెంకయ్య సేవలను వాడుకోవాలని, ఈ మేరకు బీజేపీ చీఫ్ పదవి నైనా లేక మరోసారి ఉప రాష్ట్రపతి పదవి దక్కేలా చూడాలని ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం.
దేశంలో మోదీ సర్కార్ కొలువు తీరినా బీజేపీకి ప్రధాన చోదక శక్తిగా పని చేస్తోంది ఆర్ఎస్ఎస్. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ సూచనలు, సలహాలకు ప్రయారిటీ అధికంగా ఉంటుంది. ఓ వైపు అమిత్ షా ఉన్నప్పటికీ ఇంకో వైపు వెంకయ్య నాయుడు లాంటి సక్సెస్ ఫుల్ పర్సన్ కు బాధ్యతలు అప్పగిస్తే బీజేపీతో పాటు ఇతర హిందూత్వ సంస్థలకు బలం చేకూర్చినట్లు అవుతుందని ప్రతిపాదన చేసినట్లు టాక్. ఇందులో భాగంగానే వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయనతో పలువురు నేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా లేక ఇతర ఏదైనా ఉన్నతమైన పదవిని కట్ట బెడతారా అనేది మిలియన డాలర్ల ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా ఏ పదవి ఇచ్చినా చేయగల సమర్థుడు. అంతే కాదు ఆ పదవికే వన్నె తెచ్చే నైపుణ్యం కలిగిన నాయకుడు. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శేష జీవితం గడపాలని ఉందని చెప్పిన వెంకయ్య నాయుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేక పార్టీ పరంగా పెద్దన్న లేదా పెద్ద దిక్కుగా ఉంటారా అన్నది త్వరలో తేలనుంది.