హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని మరింత ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు సంబంధించిన సేవలను వాట్సాప్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని నగర వాసులకు తీపి కబురు చెప్పింది సర్కార్. ఈ మేరకు నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేసే ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో రైలు ప్రయాణీకులకు ఖుష్ కబర్ చెప్పింది. ఇందులో భాగంగా ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ లను ప్రవేశ పెట్టింది. దీంతో రవాణా మరింత సులువుగా మారనుంది.
ఇదిలా ఉండగా హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, మహమ్మద్ అజారుద్దీన్ . ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్ పాస్ వినియోగం, మెట్రో–ఆర్టీసీ అనుసంధానం, ప్రయాణ సౌకర్యంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఒకే పాస్తో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునేలా ప్రజా రవాణా వ్యవస్థను అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు గమ్యస్థానానికి మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందన్నారు.





