
”అధికారం ఉంది కదా అని, పదవిని అడ్డం పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడటం, తనే చట్టమని, తానే శాసనమని, తాను చెప్పింది వేదమని, అదే ఆచరించాలని అనుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దం. ఇది ఏనాటికీ , ఎవరికీ మంచిది కాదు. ఇలాగే వ్యవహరిస్తూ పోతే రాచరికం తప్ప మరోటి అంటూ ఉండదు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, లొసుగులను ఆసరాగా చేసుకుని పవర్ ను ఉపయోగిస్తామంటే న్యాయ స్థానం చూస్తూ ఊరుకోదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలే తప్పా అనైతిక చర్యలకు దిగడడం, డెమోక్రసీని నిర్వీర్యం చేసేలా, శాసన వ్యవస్థకు భంగం కలిగించేలా నిర్ణయం తీసుకోవడం పూర్తిగా నేరం కిందకే వస్తుందంటూ నిప్పులు కురిపించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్తానం సుప్రీంకోర్టు. తూటాల్లాంటి మాటలతో తీర్పు వెలువరించింది . తెలంగాణలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో మందలించింది. ఒక రకంగా చెప్పాలంటే చెంప ఛెల్లుమనిపించింది. ఇవాళ ఇచ్చిన తీర్పు దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఏలుతున్న ప్రభుత్వాలకు, మోదీ కేంద్ర సర్కార్ తో పాటు ఏ ఫైల్ పంపించినా సంతకాలు పెడుతూ డూడూ బసవన్నలు లాగా వ్యవహరిస్తూ వస్తున్న , రబ్బర్ స్టాంపులుగా మారారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్లకు కూడా ఒక రకంగా హెచ్చరిక లాంటిది. ”
ఇంతకూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పు తో ఒంటెత్తు పోకడ పోతున్న సీఎంకు ముకుతాడు వేసింది. తాను ఏది చేసినా జనం తల ఊపుతారని అనే భ్రమలో ఉన్నఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆగమేఘాల మీద తమ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ జన సమితి పార్టీ ప్రెసిడెంట్ కోదండరాం రెడ్డితో పాటు ప్రముఖ జర్నలిస్ట్, ఎడిటర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఆగమేఘాల మీద సదరు ఫైల్ ను గవర్నర్ కు పంపించడం, అక్కడ సదరు గవర్నర్ ఎలాంటి ఆలోచన చేయకుండానే, పరిశీలించకుండానే, న్యాయ సలహా తీసుకోకుండానే సంతకం పెట్టేయడం జరిగి పోయింది. కోర్టు స్టే ఇస్తుందని ఆలోచించిన ఇద్దరు ఎమ్మెల్సీలు హడావుడిగా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలుగా కొలువు తీరారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఆనాటి బీఆర్ఎస్ నేతలు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు శ్రవణ్. ఈ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ వర్కవుట్ కాలేదు. దీంతో వీరి నియామకం చెల్లదని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్దం అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతూ వచ్చింది. చివరకు ఆగస్టు 13న తుది తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం.
కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించిన కోదండరాం రెడ్డి, అమీర్ అలీఖాన్ ల నియామకం చెల్లదంటూ స్పష్టం చేసింది. వీరిద్దరి పదవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరి నియామకం రాజ్యాంగ విరుద్దం అంటూ పేర్కొంది. ఈ ఇద్దరు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రశ్నించింది..సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసింది. పూర్తిగా తప్పు పట్టింది. కాగా గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని స్పష్టం చేసింది జస్టిస్ విక్రమ్ నాత్, జస్టిస్ సందీప్ మెహతా తో కూడిన ధర్మాసనం. అయితే తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ముందు అప్పటి సీఎం కేసీఆర్ దాసోజు, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. వీరిద్దరి అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తిరస్కరించారు. దీంతో తమ తిరస్కరణపై కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కోదండరామ్ రెడ్డి, అలీ ఖాన్ ల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. అయినా సీఎం తిరిగి వీరి పేర్లనే గవర్నర్ కు సిఫారసు చేశారు. గవర్నర్ ఆమోదం తెలపడం , ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగి పోయింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో గవర్నర్ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వీరి నియామకం చెల్లుబాటు కాదంటూ తీర్పు చెప్పింది. మొత్తంగా ఇటు సీఎంకు అటు గవర్నర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది ధర్మాసనం.
విజ్ఞులైన కోదండ రాం రెడ్డి, అలీ ఖాన్ లు ఈ విషయంపై ఏం మాట్లాడతారు, ఎలా తమ నియామకం సరైనదని ప్రజల ముందుకు వస్తారో వేచి చూడాలి. ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందినా కేవలం బస్సులోనే ప్రయాణం చేస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాలి. ఇకనైనా ప్రభుత్వం ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల నియామకం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పాక ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.