
సమున్నత భారతం సగర్వంగా తల ఎత్తుకుని నిలబడే రోజు ఆగస్టు 15. దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల, బలిదానాల పునాదుల సాక్షిగా భారత దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు. సరిగ్గా అర్ధరాత్రి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిన దినం. ఇందుకు గుర్తుగా కోట్లాది గుండెలలో ప్రవహించే నినాదం మేరా భారత్ మహాన్ అంటూ మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తోంది. యావత్ భారతమంతా కోటి కాంతులతో ఎదురు చూస్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక అశాంతి, వివక్ష , దాడులతో, కాల్పులతో దర్శనమిస్తున్న సంఘటనలు కోకొల్లలు. కానీ పవిత్ర భరత భూమిలో మాత్రం ఇంకా శాంతి, సామరస్యం, ప్రేమ, సహృదయత, కరుణ, దయ, జాలి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జెండా అంటే ఒక చిహ్నం కానే కాదు కోట్లాది భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక.
ఈ దేశం నాది. ఈ జెండా నాది. ఈ త్రివర్ణ పతాకం సాక్షిగా నేను ఈ దేశం కోసం ప్రణమిల్లుతున్నాను. అని ధైర్యంగా చెప్పగలిగే స్వేచ్ఛ కలిగిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారత దేశం మాత్రమే. దేశ చరిత్రలో 1947 ఒక మహోజ్వల ఘట్టం. దానికి తిరుగులేదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన రోజు ఆగస్టు 15. ఇందుకోసం చేయని ప్రయత్నం లేదు. పోరాటం లేదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఓ నా దేశమా వర్ధిల్లుమా అని భారతీయులంతా ఒకే స్వరమై ..నినాదమై..ప్రవాహమై గొంతెత్తి పిలుస్తున్న అరుదైన క్షణం ఇది. ఏ సమాజమూ సంపూర్ణంగా ఉండదు. ఏ దేశమూ పరిపూర్ణమైన శాంతిని కలిగి లేదు. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు కలగలిసిన భారతం మనది. అయినా 137 కోట్లకు పైగా జనాభా కలిగి ఉన్న ఈ భారత దేశం ఇప్పుడు ప్రపంచానికి ఓ దిక్సూచిగా నిలబడింది. శాంతి తప్ప హింసకు తావు లేదని చాటి చెప్పింది.
తను కోల్పోయింది తప్ప ఒకరికి వెలుగు పంచింది. ద్వేషంతో, విద్వేషాలతో , కుల, మతాలతో ఏదీ సాధించ లేమని చాటి చెప్పింది. సామాజిక అంతరాలు ఉన్నా మేమంతా ఒక్కటేనని చాటి చెప్పిందీ భారత దేశం. బౌద్దం, ఇస్లాం, క్రిస్టియినజం, కమ్యూనిజం, సోషలిజం, అంబేద్కరిజంకు ఆలవాలమైన ఏకైక పవిత్రమైన నేల ఈ దేశానిది. అందుకే ఇక్కడ ఎవరైనా బతకొచ్చు..స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలియ చేయవచ్చు. ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని కల్పించిన ఏకైక రాజ్యాంగం కల్పించిన చరిత్ర ఇండియాది. ఎవరు ఎన్ని రకాలుగా ద్వేషించినా..దూషించినా ప్రేమించడం మానకండి..దేశం అంటే పిడికెడు మట్టి మాత్రమే కాదు కోట్లాది ప్రజల సమైక్య సమూహం అని చాటండి. ఓ నా భారత దేశామా మేరా భారత్ మహాన్ వర్దిల్లుమా..!