నకిలీ ఓట్ల వ్యవహారం బట్టబయలు
హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కుట్రలకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తమ విచారణలో చాలా ఓట్లు నిజం కావని, పూర్తిగా ఫేక్ అని తేలి పోయిందన్నారు. గత 40 ఏళ్లలో కవిత పబ్లిక్ స్కూల్ లేన్ లేదా పొరుగున ఉన్న బంజారా నగర్ ప్రాంతంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించ లేదన్నారు. ఆ సమాజానికి చెందిన ఎవరికీ తన ఇంటిని అద్దెకు ఇవ్వలేదని ఒక నివాసి ఎత్తి చూపారని తెలిపారు ఈ సందర్బంగా జగదీశ్ రెడ్డి. సమీపంలోని ఇతర ఇళ్లలో కూడా ఇలాంటి అక్రమాలు ఉన్నట్లు తేలిందన్నారు .ఇంటి నం. 8-4-369/335 లో 27 ఓట్లు నమోదు చేశారని, ఇందులో 22 నకిలీవిగా కనుగొన్నట్లు స్పష్టం చేశారు.
అలాగే ఇంటి నం. 8-4-369/343 లో 40 ఓట్లు నమోదు చేయబడ్డాయని, 35 నకిలీవిగా కనుగొనబడ్డాయని ఇందులో ఇద్దరు ఇప్పటికీ జాబితాలో ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఇంటి నంబర్ 8-4-369/346 లో 8 మంది నిజమైన నివాసితులు కాగా ఇందులో 7 అదనపు నకిలీ ఓట్లు ఒకే చిరునామాకు లింక్ చేశారంటూ మండిపడ్డారు. కవిత పబ్లిక్ స్కూల్ లేన్ మొత్తం నకిలీ ఓటరు నమోదు కోసం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. వారికి తెలియకుండా లేదా అనుమతి లేకుండా వారి చిరునామాలకు ఓట్లు జోడించ బడుతున్నాయని నివాసితులు ఆరోపిస్తున్నారని తమ విచారణలో తేలిందన్నారు జగదీశ్ రెడ్డి. బంజారా నగర్‌లోని కవిత పబ్లిక్ స్కూల్ చుట్టూ ఉన్న మూడు లేన్లలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. అయినప్పటికీ, ముస్లింలకు చెందిన డజన్ల కొద్దీ ఓట్లు వారి చిరునామాల క్రింద ఉన్న జాబితాలో కనిపిస్తాయన్నారు.






