మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ సర్కార్ ముందస్తుగా అప్రమత్తమైంది. మరో వైపు పెద్ద ఎత్తున వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ల ముందే పాడై పోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరో వైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఏరియల్ సర్వే చేపట్టారు.
అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను సీఎం పరిశీలించారు. పంటలను కోల్పోయిన రైతులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. త్వరలోనే పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల మీదుగా హెలికాప్టర్‌లో పర్యటించారు. బాపట్ల, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే సాగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో, పంట పొలాల్లోకి దిగి, దెబ్బ తిన్న పంటలు పరిశీలించి, రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు. మొంథా తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగాయి. జనావాసాలలో నీరు చేరింది. రోడ్లు కొట్టుకు పోయాయి. బలమైన గాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలిగింది.






