వెల్లడించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన చేతికి వచ్చిన పంటలన్నీ చేతికి రాకుండా పోయాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఆర్టీజీఎస్ నుండి అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రులను సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా తుపాను కారణంగా దాదాపు 87 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ఇప్పటి వరకు తమకు సమాచారం అందిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం చేకూరిందన్నారు. భారీ వర్షాల కారనంగా 78 వేల 796 మంది రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 42 పశువులు మృత్యువాత పడ్డాయని వెల్లడించారు. పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బ తిన్నాయన్నారు. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బ తిన్నాయని, వీటి కారణంగా రూ.1,424 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీల తరలించామని, 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపట్టామన్నారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు.






