19న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహం
అమరావతి – సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈనెల 19న సీఎం ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం భారీగానే ఖర్చు చేసింది వైసీపీ సర్కార్.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్టాడారు. తమ ప్రభుత్వం అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేసిందన్నారు. సీఎం ప్రారంభించే ఈ మహోన్నత కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో దీనిని నిర్మించామన్నారు. స్వరాజ్ మైదానంలోని 20 ఎకరాలలో రూ. 400 కోట్ల తో 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహంతో పాటు 3,000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ మాల్ , ఓపెన్ థియేటర్ , గ్రంథాలయం, ధ్యానం చేసుకునేలా ప్రత్యేకమైన హాల్, పచ్చదనం ఉండేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .
అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే దేశంలో ప్రజలు స్వేచ్ఛగా, సమానత్వంగా ఉన్నారని అన్నారు. ప్రపంచంలో అంబేద్కర్ స్థానం ఎంతో గొప్పదని, ఆయన మహోన్నత వ్యక్తి అన్నారు. అంబేద్కర్ అందరివాడు అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు, అతీతంగా ఈ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.