టీటీడీ అధికారులను ఆదేశించిన జేఏవో వీరబ్రహ్మం
తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు జేఏవో వీరబ్రహ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళా బృందాల ప్రదర్శనలు ఉండాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం రోజున అలిపిరి నుండి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
భక్తులకు తాగునీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు జేఈవో. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను సమీకరించు కోవాలన్నారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను అందించాలన్నారు. శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన వీరబ్రహ్మం అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఎఅండ్ సీఏవో ఓ. బాలాజీ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఐటి జీఎం డి. పణికుమార్ నాయుడు పలువురు డిప్యూటీ ఈవోలు, అర్చకులు బాబు స్వామి, పలువురు అధికారులు పాల్గొన్నారు.







