స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం
అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవిత్ర కార్తీక మాసం సందర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేయడం, ఇందులో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని, తాను దీనిని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వేలాదిగా తరలి వచ్చిన అయ్యప్ప స్వాముల సమక్షంలో ఆ హరిహరసుతుడికి అంబలం పూజ నిర్వహించడం మరింత ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. శరణం అయ్యప్పా అంటూ చేసిన శరణుఘోష ఆధ్యాత్మికత వెలుగులు పంచిందన్నారు. కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజల మధ్య ఆ శబరి గిరీశుడి పూజలు చేసి అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
స్వామి సమక్షంలో మంత్రి వంగలపూడి అనిత పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతో కఠోర దీక్షను చేపట్టిన అయ్యప్ప స్వాములకు మేలు జరగాలని, సంక్రాంతి పర్వదినం సందర్బంగా శబరిమలకు క్షేమంగా వెళ్లి రావాలని ఆ శ్రీ అయ్యప్ప స్వామిని ప్రార్థించానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు మంచి జరగాలన్నారు. తమ కుటుంబం కూడా అయ్యప్ప స్వామిని నిరంతరం కొలుస్తూనే ఉంటామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.







