
అమరావతి – గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ నడుపుతానని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత సమావేశాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభం అయ్యాయి. సమావేశానికి సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ . నమ్మిన సిద్ధాంతాలకు అందరం కట్టుబడి ఉన్నామని చెప్పారన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి అదే సిద్ధాంతాలు తో పార్టీ నడుపుతున్నామని పేర్కొన్నారు. యువత అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారని చెప్పారు. కష్టపడి పని చేసినందుకే జనం ఆదరించారని, ఏకంగా పోటీ చేసిన ప్రతిచోటా విజయం కట్టబెట్టారని అన్నారు.
పార్టీని విలీనం చేయమని అడిగారని, కానీ ఎప్పుడూ ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయ లేదన్నారు. కూటమి విడిపోతుంది ఏమో అనే టాక్ నడుస్తోందని, ఆ ఆలోచనే పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని పార్టీలకు విలువ ఇచ్చి ముందుకు వెళ్తాం అని పవన్ కళ్యాణ్ కి హామీ ఇచ్చామన్నారు. గతంలో జనసేన పార్టీని అణగ దొక్కాలని ఆనాటి జగన్ రెడ్డి ప్రయత్నం చేశాడని, కానీ జనం తననే ఛీ కొట్టారని తమ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. తనను అరెస్ట్ చేయవద్దు అని ఒక మహిళ తన కూతురు తో బీచ్ లో కూర్చొని పవన్ కి సపోర్ట్ గా నిలబడిన విషయాన్ని కూడా డిప్యూటీ సీఎం ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారని చెప్పారు.