సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఈ సందర్బంగా ఇంత జరుగుతున్నా ఎందుకు రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు ఎంపీ రాహుల్ కు. ఎవరికీ అనుమానం రాకుండా దొడ్డి దారిన జీవో తీసుకు వచ్చే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్‌లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కేటీఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు.
కాగా కొత్తగా సర్కార్ తీసుకు వచ్చిన HILTP కింద పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవడానికి SRO (సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజాలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం డబ్బులు దండు కోవాలనే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.






