ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?
విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. నాలుగు గోడల మధ్య మాట్లాడితే తనను నాయకుడని ఎలా జనం భావిస్తారని అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెలకి ఒకటి, రెండు సార్లు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో రావడం.. వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేయడం జగన్ రెడ్డికి అనవాయితీగా మారిందన్నారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. భ్రష్టు పట్టించాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సంక్షేమం – అభివృద్ధి దిశగా దూసుకు పోతుందన్నారు. ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ రెడ్డి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు.
ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నాడని మండిపడ్డారు. మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించు కోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మీ పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి గురించి.. ఒక నరరూప రక్షసుడి గురించి.. అతనిని దేవతామూర్తి చూపించాలని చూస్తున్నారా..? లేకుంటే జోగి రమేశ్ లాంటి వ్యక్తులను అద్భుతమైన వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా..? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో నుంచి డబ్బులు కోట్టేసిన వారిని వెనుకేసుకోచ్చి భక్తుల మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారా..? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొల్లు రవీంద్ర.






