విలువలతో కూడిన విద్యను అందించడమే మా లక్ష్యం
అమరావతి : విద్యా పరంగా కీలకమైన సంస్కరణలకు ఏపీ కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విద్యార్థులు చదువుకుంటేనే సమాజంలో గుర్తింపుతో పాటు విలువ కూడా పెరుగుతుందన్నారు. మార్కులు ముఖ్యం కాదని, విలువలే ముఖ్యమని స్పష్టం చేశారు మంత్రి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అవసరం అన్నారు. ఏ మనిషికైనా చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడిగా తాను కూడా కష్ట పడుతున్నాడని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి ప్రశంసించారు వంగలపూడి అనిత.
కించిత్ గర్వం అన్నది లేకుండా ఎంతో కష్టపడి గత జగన్ రెడ్డి హయాంలో భ్రష్టు పట్టించిన విద్యా రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన నడవడికను ఆధారంగా చేసుకుని పిల్లలు నడుచుకుంటారని ఆ విషయం గుర్తించాలని పేర్కొన్నారు మంత్రి. ఈ మధ్యన సెల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారని, వారిని ఓ కంట కనిపెట్టి చూస్తూ ఉండాలని సూచించారు వంగలపూడి అనిత. అంతే కాకుండా తల్లిదండ్రులు మగపిల్లల నడవడికలపై దృష్టి పెట్టాలన్నారు. ఆడ, మగ ఇద్దరు సమానమేనని, ఇద్దరిని తల్లిదండ్రులు ఒకేలా పెంచాలని స్పష్టం చేశారు. పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.






