విశ్వ విద్యాలయం అభివృద్ది కోసం మరిన్ని నిధులు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు.
యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉస్మానియా యూనివర్సిటీని ఈ నెల 10వ తేదీన సందర్శించనున్నట్లు వెల్లడించారు. అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని సీఎం తెలిపారు. తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందు ఉంచాలన్నారు. తమ అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ కీలక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం, తదితరులు పాల్గొన్నారు.






