మాట తప్పిన ఘనులు బాబు..జగన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
తిరుపతి జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె దూకుడు పెంచారు. ఆదివారం తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మిల ప్రసంగించారు. ఆమెతో పాటు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.
ఒకప్పుడు వైసీపీని తన భుజాల మీద వేసుకుని పాదయాత్ర చేశానని అన్నారు షర్మిలా రెడ్డి. ఆ పార్టీని నిలబెట్టేందే తానని అన్నారు. అండగా నిలబడ్డానని, తన అన్న జగన్ రెడ్డి పవర్ లోకి వచ్చేలా చేశానని అన్నారు. ఇవాళ ఆ కనీసం కృతజ్ఞత కూడా కనబర్చడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
తన మీద, తన వ్యక్తిగత గత జీవితం మీద రక రకాలుగా దాడులు చేస్తున్నారని, అయినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. తాను ఎవరికీ భయపడే బిడ్డను కానని, ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఇన్నాళ్లు ఒకరు అమరావతి పేరు మీద మోసం చేశారని, ఇంకొకరు మూడు రాజధానుల పేరుతో తీపి కబుర్లు చెప్పారంటూ ఎద్దేవా చేశారు. ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారంటూ జగన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాజధానితో పాటు ప్రత్యేక హోదా రావాలని తాను తన పుట్టింటికి వచ్చానని చెప్పారు. ఎన్ని నిందలు వేసినా తాను వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు.