పిలుపునిచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర జరగనుందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సీఎం టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారని తెలిపారు. కార్గిల్ యుద్దంతో శత్రువు పాకిస్తాన్ కు తిరుగులేని సమాధానం ఇచ్చారని చెప్పారు. వాజ్ పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశ దిశ మార్చిందన్నారు. తనకు వ్యక్తిగతంగా కూడా ఆయనతో అనుబంధం ఉందన్నారు సీఎం. రాష్ట్రాభివృద్దిలో ఆయన నాడు ఎంతో సహాయం చేశారని, రాష్ట్రం కోసం ఏది అడిగినా కాదనేవారు కాదని గుర్తు చేసుకున్నారు.
ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా చేశారని. పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. టెలీ కమ్యునికేషన్ రంగం, విమానయాన రంగంలో సంస్కరణలకు నాంది పలికారని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ ను చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు సీఎం. పట్టుదల, అనునిత్యం మంచి చేయాలనే ఆలోచనతో ఉండే వారని తెలిపారు.
నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని తెలిపారు సీఎం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047కు నెంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారని ప్రశంసించారు.






