ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : అతిరథ మహారథుల మధ్య ఫ్యూచర్ సిటీ వేదిక నుండి “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితం ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా ప్రసంగించారు సీఎం. ఇది కేవలం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించే పత్రం కాదని, తెలంగాణ ప్రజల తల రాతలు మార్చే పత్రమని పేర్కొన్నారు. ఇది కేవలం జీడీపీ లెక్కలు చెప్పే పత్రం కాదని, పేద, మధ్య తరగతి బతుకులు మార్చే పత్రమన్నారు. ఇది కేవలం ఆర్థిక నిపుణుల విశ్లేషణల కోసం తయారైన పత్రం కాదని, ఆడబిడ్డలు ఆర్థిక స్వావలంబనను సాధించే పత్రమని పేర్కొన్నారు సీఎం. ఇది కార్పొరేట్ కంపెనీల వ్యూహ పత్రం కాదు, కామన్ మాన్ కు కుల మత రహితంగా సమాన అవకాశాలను అందించే పత్రమని స్పష్టం చేశారు.
తెలంగాణ రైతన్నను ఈ దేశ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చే ప్రతినిధిగా నిలబెట్టే పత్రంగా ఉండబోతోందని ప్రకటించారు. యువతను ప్రపంచ దిగ్గజ కంపెనీలను లీడ్ చేసే లీడర్లుగా తయారు చేసే పత్రంగా ఉండబోతోందన్నారు. తాత్కాలిక ప్రణాళికలకు ముగింపు పలికి శాశ్వత విధాన నిర్ణయాలను నిర్దేశించిన పత్రమన్నారు. మహనీయులు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా ఇది తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే పత్రంగా ఉండబోతోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. యావత్ తెలంగాణను CURE – PURE – RARE జోన్లుగా వర్గీకరించి, విభిన్న రంగాల్లో విస్పష్టమైన అభివృద్ధి నమూనాలను రూపొందించిన రూట్ మ్యాప్ ఇది అని స్పష్టం చేశారు. 2047 నాటికి నా దేశాన్ని ప్రపంచ వేదిక పై సమున్నతంగా నిలిపేందుకు తెలంగాణ వంతుగా తీసుకున్న సంకల్ప పత్రం అని ప్రకటించారు.






