సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. ఈ ఏడాది కూడా పెంచబోమని పేర్కొన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. పీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించామని చెప్పారు. మొత్తంగా రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని , అయినా ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించామని అన్నారు.
ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. ఐదేళ్లల్లో విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించేలా కృషి చేస్తున్నాం అన్నారు. అందరం కలిసి సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పారు సీఎం. ఒక్క పెన్షన్లలోనే ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్లకు పైగా పేదలకు పంపిణీ చేశామన్నారు. ఏపీ బ్రాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బ్రాండ్. గత పాలకుల వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ బ్రాండ్ తిరిగి తీసుకురాగలిగామని అన్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఐపీబీలు పెట్టుకుని పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నామని చెప్పారు.






