ప్రశంసలు కురిపించిన హనుమంత రావు
హైదరాబాద్ : మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన ముందు చూపు కలిగిన నాయకుడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇలా ఆలోచించ లేదన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారని చెప్పారు. అంతే కాకుండా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చారిత్రక నేపథ్యం కలిగిన ఉస్మానియా యూనివర్శిటీని పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం గా రేవంత్ రెడ్డి కొలువు తీరాక దాని గురించి ఆలోచించడం అభినందనీయమన్నారు.
ఇందులో భాగంగా ఏకంగా ఓయూ అభివృద్ది కోసం రూ. 1000 కోట్లు కేటాయించడం మామూలు విషయం కాదన్నారు. ఎందరో ప్రముఖులను రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అందించిన ఘనత ఈ విశ్వ విద్యాలయానికి ఉందన్నారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత సూదిని జైపాల్ రెడ్డి, ప్రజా యుద్ద నౌక గద్దరన్న లాంటి వాళ్లు ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ చైతన్యానికి ప్రతీక ఉస్మానియా యూనివర్సిటీ ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు వి. హనుమంత రావు. ఈ చదువుల వేదికను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పం తీసుకోవడం అభినందనీయమన్నారు.






