వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు డీజీపీ బి. శివధర్ రెడ్డి. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇప్పటి వరకు రూ. 8.20 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రలోభకర వస్తువులను సీజ్ చేసినట్లు డిజిపి వెల్లడించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 229 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 1,053 నాన్-బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల భద్రతా నిబంధనల పరిధిలోకి వచ్చే వ్యక్తుల లైసెన్స్ పొందిన అన్ని ఆయుధాలను డిపాజిట్ చేయించినట్లు ఆయన తెలిపారు. అక్రమ రవాణాను నియంత్రించేందుకు గాను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో ఉన్న రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 54 అంతర్-రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. అలాగే, ఎన్నికల మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 537 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 155 స్టాటిక్ నిఘా బృందాలు చురుకుగా పని చేస్తున్నాయని డిజిపి బి. శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.






