న్యాయమూర్తిపై అభిశంసన సరికాదు
మంగళగిరి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే సర్కార్ పై. దేశంలో హిందువులు మెజారిటీలు కాదు. హిందువుల ఐక్యత, మెజారిటీలు అన్న భావన ఒక మిథ్య. కులం, భాష, ప్రాంతాల వారీగా విభజితమయ్యారని అన్నారు. హిందువులు మెజారిటీలు అన్న భావనే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మెజారిటీ పేరిట హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నార’ని వాపోయారు.
దేశంలో ముస్లింలు, క్రైస్తవులకి వర్తించే నిబంధనలే హిందువులకూ వర్తింప చేయాలన్నారు. లేదంటే చట్టాన్ని ఒకరికి ఒకలాగా.. మరొకరి వేరేలాగా అమలు చేస్తే ఘర్షణ చోటుచేసుకొనే అవకాశాలు ఉంటాయన్నారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమాన హక్కులు కల్పిస్తుందని, న్యాయం అందరికీ సమానమేనని చెప్పారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా మంతి కార్యక్రమం అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ . ప్రతి ఒక్కరూ హిందువులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని వాపోయారు. ప్రతి సందర్భంలో హిందువుల ఆచారాలను మాత్రమే ప్రశ్నిస్తారు. తమిళనాడు ఎంపీల వ్యాఖ్యలు అదే కోవకి చెందుతాయన్నారు. ఇలాంటివి బుజ్జగింపు రాజకీయాల తాలూకు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు పవన్ కల్యాణ్. రాజ్యాంగం, చట్టం రెండు వరుసల రహదారుల్లా సమాంతరంగా పని చేయాలని చెప్పారు. ముస్లింలు, క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడేందుకు వర్తించే నిబంధనలే హిందువులకూ వర్తిస్తాయన్నారు. తమిళనాడు, అసోమ్, పశ్చిమ బెంగాల్… దేశంలో ఎక్కడ హిందూ ఆచారాలపై దాడి జరిగినా అందుకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు.






