దేశ సంపద అదానీ..అంబానీ పరం
ప్రధానమంత్రి మోదీపై భట్టి గరం
హైదరాబాద్ – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కేవలం బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఇది దేశాన్ని ఒక రకంగా మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది చేయలేదన్నారు. తెలంగాణ పేరుతో నిట్ట నిలువునా దోచి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, మోదీ ఇద్దరు జిగ్రీ దోస్తులని మండిపడ్డారు. వీరిద్దరూ కలిసి తెలంగాణ సంపదపై కన్నేశారని కానీ అనుకోకుండా ప్రజలు వీరి బంధానికి చెక్ పెట్టారని అన్నారు.
ప్రజలు సంయమనం పాటించారని, అన్నీ గమనిస్తున్నారని, ఏదో ఒక రోజు పాపం పండే రోజు తప్పకుండా వస్తుందన్నారు. అంత వరకు వేచి చూస్తూ ఉంటారని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని, ఇవాళ చిప్ప చేతికి ఇచ్చారని తాము పాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాని అన్నారు డిప్యూటీ సీఎం.