పరిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
తిరుపతి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్ యూనివర్సిటీకి రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్‌తో పాటు సమావేశం నిర్వహించనున్న మీటింగ్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు వేదిక్ యూనివర్సిటీ అధికారులకు భద్రత, సమన్వయ అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు ఎస్పీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించనున్న మార్గాలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అనంతరం కమాండ్ కంట్రోల్‌లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి విధానాలు, భద్రతా ప్రణాళికలు, పరస్పర సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. సీఎం పర్యటన సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేస్తూ, కేటాయించిన బాధ్యతలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్పీ రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు), డిఎస్పి లు వెంకట్ నారాయణ , తదితరులు పాల్గొన్నారు.






