ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమయంలో కంప్యూటర్లు, పుస్తకాలు లేని విషయాన్ని గమనించారు. ఆ వెంటనే రూ. 25 లక్షలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ తో పాటు లైబ్రరీని సమకూర్చారు. విద్యార్ధి దశ నుంచే బాలల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేయాలన్నారు. పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి సృజనాత్మకతను పెంపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటారు. అందుకు తగిన విధంగా పాఠశాలల్లో సౌకర్యాల ఉండాలని కోరుకుంటారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించారు. క్షేత్ర స్థాయి పర్యటనల సందర్భంగా పాఠశాలల్లో విద్యార్ధులకు అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీస్తూ ఉంటారు. రికార్డు స్థాయి గ్రామ సభల నిర్వహణ కోసం అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి సందర్శించినప్పుడు ఆ గ్రామంలో పాఠశాలకు ఆట స్థలం లేదని తెలుసుకుని రూ. 65 లక్షల సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు అధునాతన మోడల్ కిచెన్ ఏర్పాటు చేయించారు.





