
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు
అమరావతి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దెబ్బకు ప్రధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడంతో దీనిని నిరసిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఆర్మీ దెబ్బకు ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్ లో ఏపీకి చెందిన తెలుగు వారు చిక్కుకున్నట్లు సమాచారం. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్. బుధవారం సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించారు ఏపీ భవన్ అధికారులు. ఇప్పటి వరకూ 215 తెలుగు వారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి ఆదేశించారు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు నారా లోకేష్.
ప్రతి రెండు గంటలకు నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
నేపాల్ లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో విడియో కాల్ లో మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించారు సూర్య ప్రభ. ముక్తి నాథ్ దర్శనానికి వెళ్ళి ఒక హోటల్ లో చిక్కుకున్నాం అని చెప్పింది. హోటల్ నుండి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని సూచించారు.