ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ ను ఆమోదించరు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా ఎంత కాలం డైవర్షన్ పాలిటిక్స్ తో నడుపుకుంటూ వస్తారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్లో కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం ఉందని తెలిందా అని ప్రశ్నించారు ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారని, బుద్ది చెప్పక తప్పదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే సర్పంచ్ ఎన్నికల్లో తమకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేయడం చేత కాదని తేలి పోయిందన్నారు. అంతే కాదు సర్కార్ చేస్తున్న అప్పుల ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదన్నారు కేటీఆర్.
కాగ్ లెక్కలు నిజాలు ఏమిటో కూడా ప్రజలకు అర్థమై పోయిందన్నారు. 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఎవరు ప్రాజెక్టులు కట్టినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకు రావడం అనవాయితీగా వస్తుందన్నారు. కానీ ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరన్నారు. పోలవరం గురించి గత 70 ఏళ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచం లోనే లేదన్నారు.







