వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై భగ్గుమన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీనిని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక్కడే మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. దాదాపు 10,000 మంది నేతన్నలతో సిరిసిల్ల పట్టణం మొత్తం కదిలే స్థాయిలో ఈ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, నేతన్నల జీవితాలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి, మానవీయత, రాజకీయ సంకల్పం చరిత్రలో నిలిచి పోతుందని పేర్కొన్నారు.
కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న 2005లోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని, వస్త్ర పరిశ్రమలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని గుర్తించి స్పందించిన నాయకుడని గుర్తు చేశారు. ఒక్క వారం వ్యవధిలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో చలించి పోయిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి సోయి రావాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున 50 లక్షల రూపాయలను సిరిసిల్ల పద్మశాలి సమాజానికి అందజేసి, నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. వస్త్ర పరిశ్రమను, ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికులను కంటికి రెప్పలా కాపాడిన నాయకత్వం కేసీఆర్ గారిదేనని కొనియాడారు.






