బ్రేక్ దర్శనం భక్తులకు శుభవార్త
ఎంబీసీ -34కు వెళ్లాల్సిన పని లేద
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. గత కొన్నాళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందేందుకు. ప్రతిసారి ఎంబీసీ-34కు వెళ్లాల్సి వచ్చేది. అక్కడి నుంచి గదుల కోసం వేరే చోటుకు వెళ్లడం వల్ల సమయం సరి పోవడం లేదని వాపోయారు చాలా మంది భక్తులు.
తిరుమలను ప్రతి రోజూ 60 వేల మందికి పైగా భక్త బాంధవులు దర్శించుకుంటారు. ప్రత్యేకించి బ్రేక్ దర్శనానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. సమస్య తీవ్రతను గుర్తించిన టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బ్రేక్ దర్శనం భక్తులకు శుభవార్త చెప్పింది. ఎస్ఎంఎస్ పే సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
ఇక ఆన్ లైన్ లోనే సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్ లైన్లో సిఆర్ఓలో లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు.