వెల్లడించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. తిరుపతిలో రూ. 5 కోట్లతో జాతీయ క్రీడా అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా కేంద్రంగా అవతరిస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ ఎ. రవి నాయుడు శుక్రవారం ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు ఈ సందర్బంగా చైర్మన్. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళిక చేయబడిన ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా కేంద్రంగా అవతరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులో అత్యాధునిక వెయిట్ లిఫ్టింగ్ హాల్, అథ్లెట్ల కోసం రెసిడెన్షియల్ హాస్టల్ , వివిధ రకాల ఇండోర్ , అవుట్‌డోర్ క్రీడలకు సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
ఈ అకాడమీ హాస్టల్‌లో దాదాపు 200 మంది క్రీడాకారులకు వసతి లభిస్తుందన్నారు. ఒకేసారి 80 మంది అథ్లెట్లకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యంతో జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ హాల్‌ను అభివృద్ధి చేయనున్నారు, ప్రత్యేక జిమ్నాస్టిక్స్ హాల్ కూడా ఉంటుంది. కోచింగ్ సెషన్‌లు, సమీక్షలు, శిక్షణ కార్యక్రమాల కోసం సుమారు 150 మంది కూర్చునే సమావేశంతో పాటు శిక్షణ హాల్‌ను కూడా నిర్మిస్తారు. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు, అకాడమీ జూడో, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ , చెస్ వంటి క్రీడలకు మౌలిక సదుపాయాలను అందిస్తుంది.








