మోదీ దర్శనం సరే ఏపీ మాటేంటి
జగన్ పై కేవీపీ సీరియస్ కామెంట్స్
అమరావతి – ఏపీలో రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. అధికారంలో ఉన్న వైసీపీ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటోంది. ప్రధానంగా ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. దివంగత వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల నిప్పులు చెరుగుతున్నారు. ఆమె ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత రెచ్చి పోయారు.
ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి మోదీ దర్శనం దొరికినందుకు జగన్ ఆనంద పడి ఉండాలని కానీ ఏపీ సంగతి ఏం చేశారో చెప్పలేదన్నారు.
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు స్వామి దర్శనం చేసుకున్న ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇసుక, మద్యం కుంభకోణం లో దేశంలో చాలా మంది నేతలు అరెస్టు అయ్యారు కానీ ఎపిలోని నేతలకు మాత్రం మినహాయింపు ఉండడం విడ్డూరంగా ఉందన్నారు కేవీపీ.
బిజెపి దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటానంటూ ఎద్దేవా చేశారు .
ఏపీ లోని ఏ మంత్రి పైనా ఎంపిల పైనా కేసులు, అరెస్టులు ఎందుకు లేవో బిజెపి చెప్పాలన్నారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్నారు.
పోలవరం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియటం లేదన్నారు. వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎమ్ లా వాడుకుంటోదని సంచలన ఆరోపణలు చేశారు. అది బ్యారేజీ లాగా ఉండ కూడదన్నారు కేవీపీ.